4, ఫిబ్రవరి 2012, శనివారం

జయ పై విష ప్రయోగం జరిగిందా ??

అనగనగా ఒక అందాల యువరాణి. ఆమెకు అయినవారెవరూ ఉండరు. జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది అనుకుంటూ ఉంటుంది. ఆమెను నాశనం చేయటానికి అనేక మంది కాచుకొని ఉంటారు. వారందరిని ఆమె ఎలా ఎదుర్కొందనేదే సస్పెన్స్! ..ఒకప్పుడు ఇలాంటి కథలున్న అనేక సినిమాల్లో జయలలిత హీరోయిన్‌గా నటించారు. కానీ.. నిజజీవితంలోనూ ఆమె పరిస్థితి అదే! నమ్మకద్రోహాలూ.. పదవి నుంచి తొలగించటానికి కుట్రలూ కూహకాలూ.. అసెంబ్లీలో దుశ్శాసనపర్వాలు.. వెరసి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఒక రంగుల విషవలయం! ఇటీవలే.. ఆమెపై విషప్రయోగమూ, మంత్రతంత్రప్రయోగాలూ జరిగాయట!! ఈ దారుణాలన్నిటికీ ఒడిగట్టింది మరెవరో కాదు... జయలలిత తన ప్రాణ స్నేహితురాలిగా భావించిన నెచ్చెలి శశికళేనంటూ తెహల్కా పత్రిక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది.
పెద్దమ్మ... పురచ్చితలైవి.. అంటే జయలలిత! ఆమెకొక నీడ ఉంది. ఆ నీడ తన నెచ్చెలి, ప్రాణస్నేహితురాలు, ఆత్మబంధువు, అంతకన్నా ఎక్కువ.. అని జయ భావిస్తారు! ఆ నీడ పేరు... చిన్నమ్మ.. అంటే శశికళ! అధినేత్రికి సైతం భయపడని అన్నాడీఎంకే నేతలు కొందరు.. ఆ నీడకు భయపడతారు. వంగివంగి దండాలు పెడతారు. కానీ.. ఇదంతా గతం. 2011 డిసెంబర్ 17 నుంచి పరిస్థితి మొత్తం మారిపోయింది.పెద్దమ్మ, చిన్నమ్మల మధ్య ఎన్నో ఏళ్లుగా అల్లుకున్న అనుబంధం తెగిపోయింది. శశికళతో సహా.. జయలలిత నివాసంలో ఉన్న ఆమె బంధువులందరినీ పురచ్చితలైవి సన్నిహితులు బయటకు పంపేశారు. కాదుకాదు.. మెడపట్టి బయటికి గెంటినంత పని చేశారు. ఎందుకలా వెళ్లగొట్టారు? అసలేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ ఇప్పటికీపూర్తిగా బయటకు రాలేదు. అయితే, అన్నాడీఎంకే నేతలు చెప్పారంటూ తెహల్కా పత్రిక ఇటీవలే ఒక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది.దాని ప్రకారం... రెండు నెలల క్రితం ఒక ఎన్నారై తమిళనాడులో పెట్టుబడులు పెట్టడానికి వచ్చాడు. అందరి మాదిరిగానే పెట్టుబడుల విషయంలో చిన్నమ్మను కలిశాడు. సహజంగానే.. చిన్నమ్మ , ఆమె బంధువులు (మన్నార్‌గుడి మాఫియా అని కొందరు పిలుచుకుంటూ ఉంటారు) ఆ ఎన్నారై దగ్గర 15 శాతం 'కట్' అడిగారు. అలా కమిషన్ ఇవ్వడానికి ఇష్టపడని ఆ ఎన్నారై గుజరాత్‌కు వెళ్లాడు. ఆ రాష్ట్రముఖ్యమంత్రి మోడిని కలిశాడు.
మోడి ఈ విషయాన్ని ఒక సందర్భంలో జయలలితకు చెప్పారు. జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు ఎదురువుతాయని హెచ్చరించారు. ఇది జరిగిన వెంటనే చెన్నై మోనో రైలు ప్రాజెక్టు వివాదం జరిగింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును సింగపూర్‌కు చెందిన ఒక కంపెనీకి ఇవ్వమని జయలలిత అధికారులకు చెప్పారు. కానీ ఆ ఫైల్ ఆమె దగ్గరకు వచ్చేసరికి... మలేసియా కంపెనీ దక్కించుకున్నట్లు ఉంది. కానీ, అందులో పెట్టిన సంతకం ఆమెది కాదని.. ఎవరో జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేలింది. శశికళను అడిగితే తనకు తెలియదని సమాధానం చెప్పింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరికీ మధ్య దెబ్బలాట జరిగింది. శశికళపై అనుమానం రావడంతో... జయలలిత తాను తీసుకొనే మందుల గురించి డాక్టర్లను సంప్రదించారు. ఆమె వాడుతున్న మందులను వైద్యులు పరీక్షించగా.. ఎవరో ఆమెకు మత్తుమందులు, చిన్న మొత్తంలో విషం ఇస్తున్నట్లు తేలింది.జయలలితకు రోజూ మందులు ఇవ్వటానికి, పళ్లరసాలు అందించటానికి ఒక నర్సు ఉంది. ఆమె కూడా శశికళ నియమించిన వ్యక్తే. దీంతో జయలలితలో కొంత కంగారు మొదలయింది. అదే సమయంలో.. డీఎంకే నేత స్టాలిన్‌పై పెట్టిన కేసు చాలా బలహీనంగా ఉందని.. దీనికి శశికళే కారణమని కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనిపై జయలలిత అప్పటి ఐజీ పోన్ మణికేవల్‌ను ప్రశ్నించారు. శశికళ బలహీనమైన కేసు పెట్టమని చెప్పారని ఆయన వెల్లడించడంతోపరిస్థితి చేయి దాటిపోయిందని జయకు అర్థమైంది.
 

బెంగళూరులో రహస్య సమావేశం
2011, డిసెంబర్ మొదటివారంలో.. శశికళ కుటుంబసభ్యులందరూ కలిసి బెంగళూరులో నిర్వహించిన ఒక సమావేశం గురించి తమిళనాడు డీజీపీ కె.రామానుజం జయలలితకు చెప్పారు. ఈ సమావేశాన్ని బెంగళూరు ఇంటిలిజెన్స్ విభాగం అధికారులు ట్యాప్ చేశారు. ఆ టేపులను కర్ణాటక డీజీపీ శంకర్ బిదారీ తమిళనాడు డీజీపీ రామానుజంకు ఇచ్చారు. జయలలితకు వ్యతిరేకంగా తీసుకున్న అనేక నిర్ణయాలు ఆ టేపుల్లో ఉన్నాయి. ఈ టేపులు విన్న తర్వాత జయలలితకు వాస్తవ పరిస్థితి అర్థమైంది. వెంటనే ఆమె.. శశికళపైనా, ఆమె కుటుంబసభ్యులపైనా నిఘా పెట్టమని పోలీసులను ఆదేశించారు. వారి ఫోన్లన్నిటినీ ట్యాప్ చేయటం మొదలుపెట్టారు.
అనంతరం చకచకా పావులు కదిపి శశికళకు సన్నిహిత అధికారులను బదిలీ చేశారు. మంత్రివర్గాన్ని హాజరుపరచి ఇకపై అన్ని నిర్ణయాలు తనను అడిగే తీసుకోవాలని.. ఏవిషయంలోనూ శశికళ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. అనంతరం డిసెంబర్ 17న శశికళను, ఆమె బంధువులను ఇల్లు వదిలిపొమ్మని జయలలిత ఆదేశించింది. వీరిలో చాలా మంది ఆ ఇంట్లో 1989 నుంచి నివాసం ఉంటున్నారు. వారందరూ జయలలిత కాళ్లావేళ్లా పడ్డారు. కానీ జయ కరగలేదు. 'అమ్మ' అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందో... ఆగ్రహం అంత కఠినంగా ఉంటుందని వారందరికీ అర్థమైంది.తాంత్రిక పూజలు కూడా... అదే సమయంలో రాష్ట్ర మంత్రి కె.వి. రామలింగం ముఖ్యమంత్రిని కలవటానికి వచ్చారు. జయలలిత ఆయనను చూసి చిరునవ్వు నవ్వి.. "భవిష్యత్తు ముఖ్యమంత్రిగారికి స్వాగతం'' అని వ్యంగ్యంగా ఆహ్వానించారట. దాంతో రామలింగానికి ముచ్చెమటలు పట్టాయి! నిజానికి రామలింగం శశికళ మనిషి.ఆయనకు మూఢనమ్మకాలున్నాయని, మంత్ర, తంత్ర శాస్త్రాలను నమ్ముతారని.. 2011లో పార్టీ గెలవటానికి పూజలు చేశారని చెప్పుకొంటారు. అయితే గత కొన్ని నెలలుగా రామలింగం కేరళలో ఉన్న ఒక తాంత్రికుడిని ఉపయోగించి పూజలు చేయిస్తున్నాడని నిఘా వర్గాలు కనుగొన్నాయి. జయలలితను తొలగించి శశికళను ముఖ్యమంత్రి చేయాలనేది తన ఉద్దేశమని పైకి చెబుతున్నా.. రామలింగం శశికళను కూడా మోసం చేశారని.. తాను ముఖ్యమంత్రి అయ్యేందుకేపూజలు చేయించారని ప్రచారం. ఈ విషయం తెలియడంతోనే జయ ఆయనను "భవిష్యత్తు ముఖ్యమంత్రిగారు'' అని వ్యంగ్యంగా సంబోధించినట్టు చెబుతున్నారు
శశికళ ఆస్తులు.. రూ5వేల కోట్లు
శశికళ వ్యాపార సామ్రాజ్యం విలువ రూ.5000 కోట్లని అంచనా. 2011 ఎన్నికల్లో కూడా శశికళ, ఆమె బంధువులు అసెంబ్లీ టిక్కెట్లు అమ్ముకున్నారని, దీనిద్వారా దాదాపు రూ.300 కోట్లు సంపాదించారనేది ఒక అంచనా. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వీరందరూ రూ.వెయ్యి కోట్లకు పైగా సంపాదించారని సమాచారం. వీరి పెట్టుబడులు తమిళనాడు, కర్ణాటక, కేరళలతో పాటు.. దుబాయ్, సింగపూర్‌లకు కూడా విస్తరించాయి.
మన్నార్‌గుడి మాఫియా
శశికళ, ఆమె భర్త నటరాజన్, ఆమె అన్న వి.కె.దివాకరన్ (ముద్దు పేరు బాస్), శశికళ బాబాయి డాక్టర్ కరుణాకరన్ కుమార్తెను పెళ్లి చేసుకున్న రావణన్, మిడాస్ మోహన్ (నటరాజన్ వ్యాపారాల్లో పార్ట్‌నర్), వి.కె. సుధాకరన్, టీటీవీ దివాకరన్( శశికళ మేనల్లుళ్లు), ఎం. రామచంద్రం (శశికళ ఇంకో అన్న)... వీరందరినీ కలిపి తమిళ రాజకీయాల్లో 'మన్నార్‌గుడి మాఫియా'గా పిలుచుకుంటారు.
 
courtesy...andhrajyothy