3, అక్టోబర్ 2012, బుధవారం

'సార్' స్టైల్ మార్చారు

Sri N.Chandrababu Naidu Nellore tour photos on 12.05.12 ఎక్కడికి వెళ్లినా ప్రజలు కనిపిస్తే వారికి రెండు వేళ్లతో విక్టరీ సంకేతం చూపించడం చంద్రబాబు కొన్ని దశాబ్దాలుగా పాటిస్తున్న ఆనవాయితీ.  కానీ, 'వస్తున్నా.. మీకోసం' అంటూ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు.. ఆ విక్టరీ గుర్తును వదిలిపెట్టేశారు. చక్కగా సంప్రదాయ పద్ధతిలో అందరికీ నమస్కారం పెడుతున్నారు. పాదయాత్ర తొలిరోజే ఈ మార్పును చూపించి పార్టీ వర్గాలను కూడా ఆయన విస్మయానికి గురి చేశారు. చంద్రబాబు ఈ విక్టరీ సంకేతాన్ని చూపించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇందిరా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుర్తుగా హస్తం వచ్చిన తర్వాత దానిని స్ఫురింపజేసేలా ఆ పార్టీ నేతలు అరచేతిని ఊపేవారు. ఆ పార్టీకి ప్రత్యర్థిగా పుట్టిన టీడీపీ నేతలకు దానికి భిన్నంగా ప్రజలకు ఎలా అభివాదం చేయాలన్నది పెద్ద సమస్యగా ఉండేది.
తమిళనాడును ఆనుకొని ఉన్న చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన బాబు ఈ విషయంలో తమిళ నేతలను  ఆదర్శంగా తీసుకొన్నారు. అక్కడ జయలలిత పార్టీ అన్నాడీఎంకే గుర్తు రెండాకులు. దానికి గుర్తుగా జయలలిత మొదలుకొని ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లినా రెండు వేళ్లు చూపించేవారు. హస్తానికి ప్రత్యామ్నాయంగా ఇది బాగుందనుకొని బాబు అదే పద్ధతిని తానూ పాటించడం మొదలు పెట్టారు. ఇక్కడ దానికి విక్టరీ సంకేతంగా పేరు పెట్టారు.
సీఎంగా ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా బాబు సింబల్‌గా 'వి'గా స్థిరపడిపోయింది. కానీ, తొలిసారిగా పాదయాత్రలో బాబు విక్టరీ సంకేతాన్ని పక్కనపెట్టారు. ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసేటప్పుడు విక్టరీ సంకేతం చూపించడం సరైంది కాదని, దాని బదులు చక్కగా నమస్కారం చేస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించారు. బాబు  ఆ సూచనను ఆచరించి చూపించారు. తొలిరోజు పాదయాత్రలో పార్టీ నేతలు, సాధారణ ప్రజలు అలవాటు కొద్దీ ఆయనకు విక్టరీ సంకేతాన్ని చూపిస్తున్నా బాబు మాత్రం వారికి నమస్కారం పెడుతూ సాగిపోయారు. ఆ విధం గా బాబు తన స్టైల్  మార్చారు. ఇంతవరకూ బాగానే వుంది.ఈ రకమైన మార్పు బాబు అన్నిటా  చూపుతారా అనేదే అసలు ప్రశ్న అని విశ్లేషకులు అంటున్నారు. '