24, ఫిబ్రవరి 2013, ఆదివారం

ఏ చానల్ చూసినా ఏమున్నది గర్వ కారణం ?

తెలుగు చానల్స్ విశ్వసనీయత ను కోల్పోతున్నాయా ?అంటే  అవును అనే జవాబు విన్పిస్తుంది.తెలుగు న్యూస్ చానల్స్  ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా,అనుబంధ విభాగాలుగా మారి బాకా వూదుతున్నాయి. ఒకటికి రెండు చానల్స్లో  న్యూస్ చూస్తె వీక్షకులు పూర్తీ గందరగోళంలో పడటం ఖాయం.ఒక చానల్ ఒక వార్తను ఒక విధంగా ప్రసారం చేస్తే ఇంకో చానల్ మరో విధంగా  ఫోకస్ చేస్తోంది.
కొన్ని చానల్స్ అయితే బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నాయని ఆరోపణలు కూడా  సర్వత్ర వినిపిస్తున్నాయి.ప్రస్తుతం తెలుగులో  సాక్షి ,టీవీ 9,టీవీ 5,ఎన్ టీవీ ,జీ న్యూస్ ,మహా న్యూస్,  ఆంధ్రజ్యోతి, టీ  న్యూస్ , ఐ న్యూస్ ,  ఈ టీవీ ,
వీ 6, హెచ్ ఏం టీవీ ,స్టూడియో యెన్ ,జెమినీ ,మెట్రో టీవీ,సీవీఆర్ ,ఆర్ కే న్యూస్ వంటి చానల్స్ వార్తలను  ప్రసారం  చేస్తున్నాయి.మరికొన్ని చానల్స్ 24 గంటలు నిరంతరం  వార్తా ప్రసారాలను అందిస్తున్నాయి . మాటీవీ కొన్నాళ్ళు "న్యూస్ "ప్రసారం  చేసి మధ్యలో మానేసింది.వీటిలో చాలా చానల్స్ రాజకీయ పార్టీలతో లింక్ లున్నవే. జగన్ పార్టీకి సాక్షి అనుబంధ సంస్త అనేది అందరికి తెల్సిందే. మహా న్యూస్,  ఆంధ్రజ్యోతి ,టీవీ 9  చానల్స్ "తెలుగుదేశం "కు సహకారం అందిస్తున్నాయి.ఇక "ఈ టీవీ " సంగతి బహిరంగ రహస్యమే. తెలుగు నాట రాజకీయపార్టీలకు బహిరంగంగా మద్దతు పలికిన ఖ్యాతి "ఈనాడు"దే. తర్వాత కాలం లో క్రమంగా ప్రింట్ మీడియా లోని కొన్ని వార్తా పత్రికలూ ..... ఆపైన  చానల్స్  రాజకీయ పార్టీలకు  బహిరంగం గానే సపోర్ట్ ఇస్తున్నాయి2005 తర్వాత్  రాజకీయనేతలే చానల్స్ పెట్టె ఆనవాయితీ మొదలైంది. వైఎస్ ఇందుకు శ్రీకారం చుట్టారు.వైఎస్ అధికారంలోకొచ్చాక ఈనాడు ,జ్యోతి  అయన కు వ్యతిరేక  వార్తా కధనాలను ప్రచురించేవి.సొంత మీడియా వుంటే మేలని అయన సాక్షిని కొడుకు చేత మొదలెట్టించారు.
 ఆ  తర్వాత  తెరాస నేత కేసీఆర్ పార్టీ కోసం ఒక న్యూస్ చానల్ ను ప్రారంభించారు.  ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ గ్రూపు రెండు చానల్స్ నడుపుతుంటే, పిసిసి అధ్యక్షుడు  ఒక చానల్  నడుపుతున్నారు . సీపీఎం పార్టీ కూడా కొత్త చానల్ ను  ప్రారంభించ బోతోంది.  ఒక దశలో ప్రస్తుత కేంద్రమంత్రి చిరంజీవి కూడా ఒక చానల్ పెట్టాలని యోచించి తర్వాత విరమించుకున్నారు.
ఇటీవల కాలం లో చానల్స్ సంఖ్య  పెరిగిపోవడం, ఆదాయం తగ్గడం, వ్యయం పెరగడం వంటి కారణాలుగా చానల్స్ రాజకీయ నాయకుల చేతిలోకి వెళుతున్నాయి.ఇదొక కొత్త పరిణామం. ఈ పరిణామం వల్ల చానల్స్ విశ్వసనీయతను కోల్పోతున్నాయి.అదలా ఉంటె మన చానల్స్ లో వార్తలు ఎలా ఉంటాయంటే  జీ న్యూస్ లో కాంగ్రెస్  పార్టీకి క్రెడిట్ లభించే విధంగా వార్తలు ఉంటే .,,ఇక ఐ న్యూస్‌లో  ముఖ్యమంత్రి కిరణ్‌ ఇమేజ్ ను బూస్టప్  చేసేలా వార్తా కధనాలు  ప్రసారమౌతుంటాయి . గతంలో ఒకే వర్గం చేతిలో మీడియా ఉన్నప్పుడు చంద్రబాబు పాలనను ఏ విధంగా ఆకాశానికి ఎత్తారో ఇప్పుడు ఐ న్యూస్‌లో కిరణ్‌కు ఆ స్థానం కల్పిస్తున్నారు. సమస్యలన్నీ అదిగమించి ఆయన దూసుకెళుతున్నారట! ఇక ఆంధ్ర జ్యోతి ఈటీవీ ,టీవీ 9,మహా న్యూస్ వంటి చానల్స్ లో చంద్రబాబు కి అనుకూల వార్తలు ప్రసారమౌతుంటాయి. . ఆ చానల్స్ లో కొన్నింటికి చంద్రబాబు ఆర్ధికం గా సహాయ పడ్డారని,కొన్నింటిలో అయన వాటాదారు అని అంటారు. ఇందులో నిజం ఎంతో ఏమో గానీ  ఆ చానల్స్ అన్నీ బాబుకి వ్యతిరేకంగా ఎలాంటి వార్తా కధనాలు ప్రసారం చేయవు.అవేపుడూ బాబు వ్యతిరేకులను ఉతికి ఆరేస్తుంటాయి.
ముఖ్యంగా  చనిపోయిన వైఎస్ ,జైల్లో వున్నజగన్ ఆ చానల్స్ కి హాట్ సబ్జెక్ట్స్.ఇక జగన్ చానల్ సాక్షి ఆ చానల్స్ లో  వచ్చే కథనాలను తిప్పి కొడుతూ బాబును ,రామోజీని తూర్పరా పడుతోంది.
టీ న్యూస్ తెలంగాణ వాదానికి, టిఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తోంది. అలా అని మిగిలిని చానల్స్ నిస్పక్షపాతంగా ఉంటున్నాయని కాదు. అంశాల వారిగా, ఒప్పందాల వారిగా కొన్ని చానల్స్ కొన్ని పార్టీలకు అండగా నిలుస్తున్నాయి.ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఓ న్యూస్‌చానల్‌ను పెట్టుకోవచ్చు.దేశంలో ఇప్పటివరకు 122 న్యూస్‌చానల్స్‌ ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇవి ప్రపంచంలోనే చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ చానల్స్‌ మధ్య ప్రకటనల యుద్ధం కొనసాగుతుంది. గత రెండు సంవత్సరా లుగా ప్రకటనల రూపంలో ఈ చానల్స్‌ రూ.2,000 కోట్ల మేరకు వ్యాపారం చేశాయి. తెలుగులో 17  న్యూస్ చానళ్ళు ఉన్నాయి. ప్రకటనల ఆదాయం అన్ని చానళ్ళకు సరిపోదు. అంటే ప్రకటన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు ఈ చానళ్ళ మీద అవుతోంది. తెలుగు న్యూస్ చానళ్లలో చాలా చానల్స్ నష్టాలతోనే నడుస్తున్నాయి. మంచి మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ లేని కొరత  చానల్స్  లో కన్పిస్తోంది.ఫలితంగా  యాడ్ రెవిన్యూలో వెనుకబడి  నష్టాల్లో కూరుకుపోతున్నాయి.
 చానల్స్ కి ఎన్నికల ముందు అయితే ఆదాయం ఉంటుంది కానీ ఇప్పుడు ఆదాయం లేక చాలా చానళ్ళు విలవిల్లాడుతున్నాయి.ఈక్రమం లో అడ్డ దారి తొక్కుతున్నాయి. లేదా రాజకీయ నేతల చేతుల్లోకి వెళుతున్నాయి.  గత రెండు మూడు సంవత్సరాలుగా పంపిణీ, టాలెంట్‌ ధరలు రెట్టింపయ్యాయి. టాలెంట్‌ ఖర్చులు అంటే ప్రొడ్యూ షర్లు, రిపోర్టర్లు, టెక్నిషన్స్‌, యాంకర్లు ఇలా వారి టాలెంట్‌ను బట్టి వేతనాలు ఇవ్వాలి. అలా చేయలేక కొన్ని చానల్స్ వెనుక పడుతున్నాయి. ఇక తెలుగు న్యూస్‌ మార్కెట్‌ విషయానికొస్తే.2007లో కేవలం ఐదు న్యూస్‌ చానల్స్‌ మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉండేవి.అవి ఇపుడు 17కు చేరుకున్నాయి.వీటన్నింటికి సరి పడా యాడ్  మార్కెట్లేదు.


తరువాయి పార్ట్ 2 లో  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి