1, ఆగస్టు 2013, గురువారం

'రాములమ్మ' దారెటు?

'రాములమ్మ'ను  టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు.కొన్నాళ్లుగా విజయ శాంతి పార్టీ అధినేత కేసీఆర్తో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మెదక్ సీటు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. కాగా   కాంగ్రెస్‌లో చేరేందుకు ఆమె ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు రావడం... ఆ వార్తలను ఆమె ఖండించకపోవడంతో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. విజయశాంతిని సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం అర్ధరాత్రి తర్వాత ప్రకటించారు.  "పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విజయశాంతిని ఇప్పటికే అనేకసార్లు క్షమించాం. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు ఇస్తాం. పొలిట్‌బ్యూరో ఏకాభిప్రాయం మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని టీఆర్ఎస్ తెలిపింది.టీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యం తగ్గడంతో... విజయశాంతి కొన్నాళ్లుగా పార్టీ కార్యాకలాపాల్లో పాల్గొనడంలేదు. ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విభజన అంశంపై అటు రాష్ట్రం, ఇటు కాంగ్రెస్ పెద్దలు తలమునకలైన సమయంలోనే ఆమె ఢిల్లీకి వెళ్లారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో సమావేశమై మెదక్ ఎంపీ సీటుపై హామీ ఇప్పించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇపుడు సస్పెన్షన్ వేటు పడటం తో నేడో రేపో విజయశాంతి తన నిర్ణయం ప్రకటించవచ్చు. బీజేపీ నేతలు కూడా ఆమెను సంప్రదిస్తున్నారు. అద్వానీ వంటి అగ్ర నేతలతో ఆమెకు పరిచయాలున్నాయి. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి